Significance of Vinayaka Chavithiby Sri Chaganti Koteswara rao garu

వరసిద్ధి వినాయకునికి చవితినాడు పూజ ఆరంభం చేసి మనం చతుర్దశి వరకు అనగా తొమ్మిదిరోజులు అర్చన చేయాలి. అలా ఎందుకు అంటే చవితి తిథికి గణపతి యాజమాన్యం కలిగి ఉన్నాడు. చతుర్దశి నాడు పరమశివుని అర్చిస్తాము. కాముడు/మన్మథ స్వరూపానికి చతుర్దశి ప్రతీకగా ఉంటుంది. మన కోరిక నెరవేర్చబడాలి అంటే తొమ్మిదిరోజులు చతుర్దశి వరకు పూజ చేయాలి. తొమ్మిది రోజులు కుదరని పక్షంలో 3/5/7 రోజులు చేయడం ఉన్నది.


ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను (బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది) అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు.

ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి ఇంటా యథావిధి గణపతిని పత్రాలతో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగ, అరటి, కొబ్బరి మొదలైన ఫలాలు నివేదించాలి.

పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఈస్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. వెంటనే దయ చూపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు.

Comments

Popular Posts