Sri Veerabhadra Swamy Vari Devasthanam | Rayachoti, Kadapa

ఆలయ చరిత్ర :
శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము రాయచోటి, కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్.


అలనాడు దక్షప్రజాపతి అత్మజ్ఞాన హీనుడై ,శివ ద్వేషంతో తలపెట్టిన యజ్ఞానికి పతిదేవుని మాట మీరి విచ్చేసిన సతీదేవి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. అది తెలిసి మహోగ్రుడైన రుద్రుడు తన జటను పెరికి నేలకు విసిరితే అందుండి ప్రళయ భీకరాకార వీరభద్రుడు ఉద్భవించి  రుద్రగణ సహితుడై యగ్నశాలపై విరుచుకుపడ్డాడు. ఆ నిరీశ్వర యాగానికి విచ్చేసిన దేవతలందరినీ దండించాడు.దక్షుని పట్టుకొని తన ఖడ్గంతో శిరస్సు ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు.అర్ధాంతంగా దక్షయజ్ఞం ఆగిపోయింది .వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించాడు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడై వర్దిల్లుగాక! అని దీవించాడు.అప్పటి నుండి వీరభద్రుడు వీరేశ్వరుడని పిలువబడ్డాడు.తరువాత పరమశివుడు దక్షుని యజ్ఞశాలలో అగ్నిలో ఆహుతి అవుతున సతీదేవి శరీరాన్ని చూచి (దేవీపురాణం) బోరున విలపించాడు. ఉన్మాది అయిపోయాడు.సతీచిత్కళాశరీరాన్ని వెలికితీసి భుజాన వేసుకొని దేశదిమ్మరిలా భూమండలమంతా తిరగనారంభించాడు. దిగ్ర్భమలోనున్న శివుని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి శివుని వెంబడిస్తూ తన సుదర్శన చక్రంతో సతీచిత్కలాశరీరాన్ని ముక్కలుగా ఖండిస్తూ వచ్చాడు.అవి భూమండలలో 108 చోట్లపడి శక్తి పీఠములై వెలిశాయి మరియు అవి పడ్డచోటల్లా శివలింగములు ఉద్భవించి అవి దివ్యశివశక్తి పీఠములై ప్రకాశించాయి.తన భుజాన ఉన్న సతీచిత్కలాశరీరం కూడా మాయమై పోవడంతో పూర్ణవిరాగియైన శివుడు ఒక వట వృక్ష మూలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చుండి పోయాడు.ప్రజా పతులతోజ్యేష్టుడైన దక్షుడు ప్రాణాలు కోల్పోవడం అర్ధాంతరంగా యజ్ఞం ఆగిపోవడం లోకోపద్రవాలకు దారి తీసింది.సృష్టి క్రమానికి ఆటంకం ఏర్పడింది.శివాపరాదానికి గురైన దేవతలు దివ్యతేజోవిహీనులైపోయారు. దేవతలందరూ అలోచించి శివానుగ్రహంపొంది దక్షున్ని బ్రతికించి లోకకళ్యాణార్ధం తిరిగి యాగం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.బ్రహ్మాది దేవతలు విష్ణు మూర్తిని వెంట పెట్టుకొని కైలాసం వెళ్లారు.అక్కడ దక్షిణాభిముఖుడై వటవృక్ష మూలంలో చిన్ముద్ర ధరించి మౌనియై బ్రహ్మనిష్టలో ప్రకాశిస్తూ దక్షిణామూర్తియైన శివుడు దేవతలకు దర్శనమిచ్చాడు.ఏకాగ్రచితులై దేవతలు భక్తితో దక్షిణామూర్తినిమనసారా ప్రార్ధించారు. తమ తప్పు క్షమించమని పాదాలు మొక్కారు.స్వరం గ్రహించిన గురుమూర్తి వారి తప్పున మన్నించాడు.దక్షుని అపరాధాన్ని బాలాపరాధంగా భావించి క్షమించాడు.

ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన ఆంశీభూతుడైన వీరభద్రున్ని పిలిచి ఇలా అన్నాడు “పుత్రా ! వీరభద్రా! కాలదోషం పట్టి ప్రజాపతులకు దేవతలకు ఆత్మజ్ఞానం నశించింది.అజ్ఞానంతో వారు చేసిన పనివల్ల సతీదేవి ప్రాణత్యాగం వారిపాలిట స్త్రీహత్యాపాతకమై చుట్టుకుంది. కారణావతారుడవైన నువ్వే వీరందరికీ జ్ఞానభిక్ష పెట్టగల సమర్దుడవు. మూర్ఖుడైన దక్షునికి ప్రాణబిక్ష పెడుతున్నాను.

దక్షాది సర్వదేవతలకు నువ్వే మార్గదర్శకుడవై నిలిచి వారి పాపప్రాయశ్చిత్త నిమిత్తం భూమండలలోని 108  పవిత్ర శివశక్తి పీఠములను , ద్వాదశ జ్యోతిర్లింగములను దర్శింపజేసి గంగాది పుణ్యానదీస్నాన తీర్ధస్నాన సముద్ర స్నానాదులాచరింపజేసి వీరందరినీ స్త్రీహత్యాపాతకము నుండి విముక్తులను గావించి నాపంచాక్షరీ మంత్ర దీక్ష ఇచ్చి అందరిని పరిశుద్దులను చేసి తిరిగి వారికి యజ్ఞార్హత కలుగ జేయుము”అని అజ్ఞాపించాడు.పరమశివుడు తనకు అప్పజెప్పిన ఈ బృహద్యాత్రాకార్యం తన మహాద్బాగ్యముగా శిరసావహించిన వీరభద్రుడు వెంటనే దక్షుని యజ్ఞశాలకు బయలుదేరాడు.అక్కడ పడివున్న దక్షుని మొండానికి మేకపోతుతల అతికించాడు. శివానుగ్రహంచేత దక్షునికి ప్రాణం వచ్చింది. పునర్జీవుడైన దక్షుడు వీరభద్రుని పాదాలు పట్టుకొని తనకు జ్ఞాన బిక్షపెట్టమని వేడుకొన్నాడు. అంటా శివ సంకల్పం అని చెప్పి వీరభద్రుడు ప్రమధగణ, ఋషీగణ, దేవతాగణ, సహీతుడై దక్షబ్రహ్మను వెంటబెట్టుకొని బృహద్యాత్రకు బయలుదేరాడు.

నారదాది మునీంద్రులు శివ సంకీర్తనలు ఆలపిస్తుండగా నందీశ్వర భ్రుంగీశ్వరాధి ప్రమధ గణములు హరహర మహాదేవ! శంభోశంకర!! అంటూ వీరభద్రునికి తోడై శివనామ స్మరణ చేయుచుండగా, వీరభద్రుని సారధ్యంలో హిమాచలం మొదలుకొని రామేశ్వరం దాకా 108 శివశక్తి పీఠములు ,ద్వాదశ జ్యోతిర్లింగములు , శతరుద్ర, కోటి రుద్ర శివలింగములు దర్శించుకోంటూ జగన్మాతను అన్ని క్షేత్రములందు శ్రద్దాభక్తులతో సేవిస్తూ గంగానది స్నాన, పవిత్ర తీర్ధ స్నాన,పరమపవిత్ర సముద్ర స్నానాలు చేసి పునీతులైనారు.పవిత్రయాత్రలో పావనమైన దక్షాది దేవతలు తమకు శివమంత్ర దీక్ష ఇచ్చి శివజ్ఞాన సంపన్నులను జేసి శివానుగ్రహానికి పాత్రులను గావించవలసిందిగా వీరేశ్వరుని ప్రార్ధించారు.

శివదీక్షకు అర్హమైన పుణ్యస్థలాన్ని నిర్ణయించేందుకు వీరేశ్వరుడు తన ఇష్టలింగమైన వీరేశ్వర లింగాన్ని  అనుసరించాడు. తిరుగు ప్రయాణంలో రామేశ్వరానికి , శ్రీశైలానికి నడుమనున్న ఈ మాండవ్యనదీ తీరమందు వీరేశలింగము నిలిచి ప్రకాశించింది. అప్పటికే ఇచ్చోట మాండవీమాత (యలమ్మ) ఆలయం నెలకొని వుండేది. వీరేశలింగం వెలయడంతోఈ క్షేత్రం శివశక్తి పీఠమై తేజరిల్లింది. సర్వదేవతలకు ఇచ్చట మనస్సు శాంతించింది.అంతా శివసంకల్పం అని భావించిన వీరేశ్వరుడు తదేక భక్తితో పరమశివున్ని ధ్యానించాడు.తక్షణం పొడవాటి మీసములువాడియైన కోరలు , సహస్రభుజ ,సహస్రాయుధ వీరాజితుడైన వీరభద్రుని ఉగ్రరూపం మటు మాయమైపోయింది .మౌని,చిన్మద్రధారి,సర్వలోక గురుస్వరూపియైన , శ్రీ దక్షిణామూర్తి వీరేశ్వరుడు దేవతలకు దర్శనిచ్చాడు.ఆ చిన్మయచిదానంద రూపం చూచి దక్షాది దేవతలు , తమ జన్మ పావనమైనదని భావించి గురు వీరభద్రుని పాదాలు భక్తితో పూజించారు. గురుకారుణ్యం వర్షించింది. సతీ జగన్మాత అత్మశాంతించింది.దక్షాది అమరులకు పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రోపదేశమయ్యింది. శివతత్వం భోద పడింది. ఆత్మానందంతో అమరులు పరవశించారు.దక్షాది దేవతలందరికి తిరిగి దివ్యతేజస్సు ప్రకాశించింది. తమకు జ్ఞానభిక్షపెట్టిన ఈ పుణ్యక్షేత్రములో “అమరగురు వీరేశ్వరుడనే” పేరిటవెలసి నిత్యం దేవతలసేవలు అందుకోవలసినదిగా దక్షాది దేవతలు వీరభద్రుని ప్రార్ధించారు. కారణావతారుడైన వీరేశ్వరుని బృహత్కార్యం నెరవేరింది. దేవతలకు శివానుగ్రహం కలిగింది, అంతా శివసంకల్పంగా భావించిన వీరేశ్వరుడు అమరుల విన్నపం మన్నించాడు. పాల్గుణ శుద్దతదియ ఉత్తరాభాద్ర నక్షత్ర శుభలగ్న మందు శుద్ధ సత్వ సుందర గురురూపందాల్చి,నాగ కుండల రుద్రాక్షమాల శోభితుడై,కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమ చేత అభాయమనే ఖేటకం ధరించి అర్ధాంగి భద్రకాళీ సమేతుడే ఇచ్చట అర్చామూర్తిగా ఆవిర్భవించాడు. అమరులచేత పూజింపబడ్డ ఈ క్షేత్రం: అమరగురు వీరేశ్వర క్షేత్రమై” దక్షిణ కాశీగా ప్రసిద్దికెక్కింది. పరిశుద్ధులై తిరిగి యజ్ఞార్హత సంపాదించిన దక్షాదిదేవతలు అమరగురు వీరేశ్వరుని పాదపూజగావించుకొని గురు ప్రసాదంతో కైలాసం చేరి శివునికి
నమస్కరించారు. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు సంతోషించాడు. లోక కళ్యాణకర్తయైన పరమేశ్వరుడు దక్షునిచేత తిరిగి యాగం ప్రారంభించి నిర్విఘ్నంగా పరిసమాప్తిగావించాడు. యజ్ఞంలో అగ్రపూజితుడై సర్వలోకాలను తన చల్లని చూపులతో కటాక్షించాడు.ఈ విధముగా దేవతల అభీష్టం మేరకు స్వయం ప్రతిష్టితమై అతి ప్రాచీన చరిత్ర సంతరించుకొన్న శ్రీ వీరేశ్వరక్షేత్రం ప్రస్తుత కట్టడాలు,చోళ రాజుల శైలిని పోలియున్నవి.దిగ్విజయ యాత్ర గావిస్తూ వచ్చిన రాజరాజ చోళుడు ఈ అమరగురు వీరేశ్వరుని దర్శించి ఎంతో మనశ్యాంతిని అనుభవించాడట. ఇతని కాలంలో శ్రీ వీరేశ్వరాలయం నిత్య రాజోపచారములతో విశేష కీర్తి గడించింది. రాజరాజ చోళునిచే సేవింపబడ్డ వీరేశ్వరుడు రాచరాయుడుగా పేరుగాంచాడు.రాచారాయుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం రాచవీడుగా ప్రసిద్దికెక్కి కాలక్రమేణా అది రాయచోటిగా నామాంతరం పొందినది. అనంతరం కాకతీయ గణపతిదేవుడు , మట్లి మహారాజులు, శ్రీ కృష్ణదేవరాయల వారు శ్రీ వీరేశ్వరుని ఆలయానికి యెనలేని సేవచేశారు. సదాశివ దేవరాయల వారు స్వామి వారి గర్భాలయం , అంతరాలయం 15 వ శతాబ్దంలో జీర్నోద్ధారణ గావించాడని శిలాశాసనముంది. కన్నడ భక్తులు ఈ రాయచోటిని రాచోటి అనియు , వీరేశ్వరుని “రాచోటి ఈరన్న “ అని  ముద్దుగా పిలుచుకోంటూ వుండటం గమనార్హం. ప్రస్తుతం మనం వీరభద్రస్వామి అని పిలుస్తున్నప్పటికి ఆలయంలోని అన్ని శిలాశాసనాలలో వీరేశ్వరుడనే చెక్కబడి యున్నది. అలనాడు దక్షాది దేవతల ప్రార్ధన మన్నించి గురు పాదపూజ నిమిత్తం ప్రతియేటా ఉత్తరాయణం మీనమాసం సూర్యోదయం ఉదయం 6 గంటలకు మీనా లగ్నమందు 5 రోజులు కేవలం అరగడియ కాలం సాత్విక దేవతలకు మరియు దక్షిణాయనం కన్యామాస కన్యాలగ్నమందు 5 రోజులు కేవలం అరగడియకాలం ఉగ్రదేవతలకు, సూర్యమండలం నుండి సూర్య రశ్మి మార్గాన గర్భాలయం ప్రవేశించి పాదార్చన చేసుకొమ్మని వీరేశ్వరుడు వరమిచ్చాడట. ఇప్పటికీ మనము ఈ విచిత్రం ప్రత్యక్షంగా చూడవచ్చును.ఆంధ్ర,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు రాష్ట్రాల నుండి అశేష భక్తజనులు ఈ వీరేశ్వర క్షేత్రాన్ని నిత్యం సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వీరశైవులకు శ్రీశైలం తదుపరి ప్రధాన వీరశైవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది.అలనాడు స్వామివారు అర్చాముర్తిగా వెలసిన పాల్గుణ శుద్ధ తదియ ఉత్తరాభాద్ర నక్షత్రమందు ప్రతియేటా స్వామివారి రధోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.


వీరభద్రుడు అభిషేక ప్రియుడు. ప్రతినిత్యం భక్తులు చేసే రుద్రభిషేకాలతో స్వామి సంతుష్టుడౌతుంటాడు.నంది వాహనాలంకారాలతో శోబిల్లుతుంటాడు. ఆకూ పూజలతో అలరారుతుంటాడు. నామార్చనలతో అర్చింపబడుతుంటాడు. నందాదీప, గుగ్గుళ దీపాలతో ప్రకాశిస్తుంటాడు.దీన నమస్కార, పోర్లుదండాలతో భక్తులు మ్రొక్కులు చెల్లిస్తుంటారు. భక్తులు బాలాబసవన్నలను(కుర్ర దూడ) అర్పించుకుంటుంటారు. వీరశైవులు వీరతాండవాలతో నర్తిస్తుంటారు.”శ్రీ వీరభద్రేశ్వర మహారాజ్ కి  జై!” అను నినాదాలతో ఆలయం ప్రతిధ్వనిస్తూ కైలాసాన్ని మరిపిస్తూ వుంటుంది. భక్తులు పలురకాలైతే వీరభద్రుని మహిమలు మరీ విచిత్రాలు.స్వామివారు జాతి,కుల,మత,భేదం లేకుండా నమ్మినవారి నట్టింట నర్తించి అనుగ్రహిస్తుంటాడు.

రాచరాయుడు,రాజన్న,వీరన్న,ఈరన్న,వీరేశ్వరుడు,వీరేశుడు మరియు రాచోటేశ్వర్ అని పలునామాలతో పిలువబడే ఈ రాయచోటి వీరభద్రుని మహిమలు భక్తులకే బాగా తెలుసు.

రాచరాయుడు,రాజన్న,వీరన్న,ఈరన్న,వీరేశ్వరుడు,వీరేశుడు మరియు రాచోటేశ్వర్ అని పలునామాలతో పిలువబడే ఈ రాయచోటి వీరభద్రుని మహిమలు భక్తులకే బాగా తెలుసు.

దర్శన వేళలు :
ఉదయం 7:30 గంటల నుండి 12:30 వరకు సాయంత్రం:4:00 గంటల నుండి 8:30 వరకు.

అభిషేకం వేళలు :
ప్రతి రొజు ఉదయం: 5:15 నుండి 7:30 వరకు ఉదయం: 9:30 నుండి 11:30 వరకు

మూల విరాట్ :
శ్రీ వీరభద్రస్వామి వారు , శ్రీ భద్రకాళీ అమ్మవారు.

ఉప ఆలయములు :
శ్రీ విగ్నేశ్వర స్వామి వారు, శ్రీ అఘోరలింగేశ్వర స్వామి వారు,శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ కాలభైరవ స్వామి వారు, నంది మండపం, శ్రీ నవగ్రహ మండపం,శ్రీ బసవేశ్వర స్వామి మండపం,నాగరాళ్ల మండపం, శ్రీ అశ్వద్ద వృక్షం.

రవాణా :
By Road:
రాయచోటి కడప నుండి 51 కి.మీలు,గండి నుండి 45km దూరంలో కలదు, చిత్తూర్ నుండి 112 కి.మీలు మరియు తిరుపతి నుండి 120 కి.మీల దూరంలో కలదు. రాయచోటి బస్టాండ్ నుండి ఈ ఆలయం 0.6 కి. మీ దూరంలో కలదు.

By Train:
ఈ ఆలయానికి సమీపంలో కడప మరియు పీలేరు నందు రైల్వే స్టేషన్స్ కలవు.

By Air:
69 కి.మీల దూరంలో కడప విమానాశ్రయం కలదు.

సంప్రదించండి :
శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం,
రాయచోటి, కడప జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ – 516269.

ఫోన్: +91 08561-250307
rayachoti veerabhadra temple accommodation, rayachoti railway station, rayachoti veerabhadra swamy photos, rayachoti images, veerabhadra swamy matam, veerabhadra swamy temple near me, rayachoti to kadapa, veerabhadra swamy temple kerala, veerabhadra swamy temple history telugu, veerabhadra swamy temple rayachoti.

Comments

Popular Posts