Sri Lakshmi Chennakesava Swami Devastanam | Markapur

ఆలయ చరిత్ర :
కృతయుగే గజారణ్యే, 
త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం,
కలౌ మారికాపురీ-
అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. శ్రీస్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షులవారు రచించిన ‘గజారణ్య సంహిత’ ద్వారా మనకు తెలుస్తోంది.


కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునిపుంగవులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. ప్రస్తుతం ‘గుండ్లకమ్మ’ అని పిలువబడుతున్న గుండికానదీ తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట. ఈ ‘గుండ్లకమ్మ’ నది పుట్టుక వెనుక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది.

కుండల నుంచి కారిన నీరు….

పూర్వం నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనేచోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే కథనం. ఆ గుండికానదే వాడుకలో “గుండ్లకమ్మ” గా రూపాంతరం చెందింది. ఇదిలా ఉండగా, గుండికానది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను ‘కేశి’ అను రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, శివుని వేడుతూ తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై “మార్కండేయా! ఈ రాక్షసుడు ఎవరివల్లా చావురాకూడదంటూ బ్రహ్మనుంచి వరం పొందాడు. కాబట్టి ఇతడిని సంహరించాలంటే విష్ణువును ప్రార్థించడమే సరి!” అని చెప్పి మాయమయ్యాడు.  వెంటనే మార్కండేయ మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేసాడు. మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, రాక్షసునిపై అనేకమైన ఆయుధాలను ప్రయోగించాడు. అయినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్యదృష్టితో తెలుసుకొని విష్ణుమూర్తి, రాక్షసుని చంపమంటూ తనకు పానుపుగానున్న ఆదిశేషుని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన ఆదిశేషుడు, తన విషజ్వాలలతో కేశి రాక్షసుని అంతచేసాడు.

అప్పుడు ప్రసన్నులైన స్వామి, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు మహర్షి, స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవ పేరుతో ఇక్కడ వెలశారని ప్రతీతి. ద్వాపరయుగంలో స్వామిని ఇక్కడి ఋషులు మాధవనామంతో పిలుచుకుంటూ, యజ్ఞయాగాదులు చేసేవారట. ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండటం వల్ల, ఈ చోటు స్వర్గాదిలోకాలకు సోపానం వంటిదని చెప్పుకునే వారట.

ఈ కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ‘మారికాపురం’ అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే ‘మార్కాపురంగా’ మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న ‘చెన్నరాయుడుపల్లె’కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.

మార్కాపురం ‘చుంచు’
గతంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, బళ్లారి జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా చెప్పబడుచుండేవి. ఈ జిల్లాలన్నింటినీ కలిపి దత్తమండలంగా చెప్పేవారు. గతంలో మార్కాపురం కర్నూలు, కడప జిల్లాలలో ఉండేవి. ప్రస్తుతం ఈ పట్టణం ప్రకాశంజిల్లాలో అంతర్భాగం. శ్రీ కృష్ణదేవరాయలవారి కాలంలో ఈ ప్రాంతాన్ని కొచ్చెర్లకోట సీమ, దూపాటిసీమ, నెల్లూరు సీమలుగా పరిగణించేవారు. నెల్లూరు సీమను పాలించిన శ్రీ సిద్ధిరాజు తిమ్మరాజయ్యగారు, రాయలవారి ఆజ్ఞమేరకు మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివారికి గర్భాలయము, అంతరాళం, మధ్యరంగం, మహా ద్వార నిర్మాణాలు చేయించి నట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగం, తిరుపతి, వెంకటగిరి, నెల్లూరు, మార్కాపురం, శ్రీశైలం, మాహానంది, అహోబిలం మిగిలిన క్షేత్రాలను అభివృద్ధి చేస్తూ, సుమారు 120 పైగా దానశాసనాలను వేయించారని చరిత్రకారులు చెబుతుంటారు. మార్కాపురం దేవాలయంలో రాయల దానశాసనాలు 15 దాకా ఉన్నాయి. వాటిలో శ్రీస్వామివారికి బ్రహ్మోత్సవాలు, పండుగలలో జరిగే కైంకర్యాల కోసం గ్రామాలను, భూములను దానం చేసినట్లుగా తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లోనే పేరుపొందిన మార్కాపురం ‘చుంచు’ (సన్‌షేడ్) ఆలయ మధ్యరంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే కానీ, వర్ణించటం వీలుకాదు. అలాగే దేవాలయ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అద్వితీయమైనది. ఉదాహరణకు ధనుర్మాసంలో సూర్యుని కిరణాలు మూలవిరాట్టు పాదాలనుండి శిరస్సు దాకా వ్యాపించడాన్ని నేటికి చూడవచ్చు. గాలిగోపుర నిర్మాణం ద్వారం వరకే నిలిచిపోగా, 1928-1936ల మధ్య రాయసం యోగేశ్వరరావు గారు, లింగరాజుగార్ల సహకారంతో తొమ్మిది అంతస్థుల గాలిగోపుర నిర్మాణం జరిగింది. ఆలయంలో ఆళ్వారాదులు, శ్రీలక్ష్మీనరసింహస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీరంగనాయకస్వామి, శ్రీగోదాదేవి, శ్రీరామానుజాచార్యుల వారిని దర్శించుకోవచ్చు.

రాయలవారి కాలంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు, ఇందుకయ్యే ఖర్చును కొచ్చెర్లకోట సీమలోని యాచవరం, పందిరిపల్లె గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించే విధంగా రాయలవారు ఏర్పాటుచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. నేటికీ నిత్యం భక్త జనుల సందడితో కళ కళలాడుతున్న మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దర్శనం సకల పుణ్యప్రదం.

రవాణా :
By Road:
ongole to markapuram = 94 Kms
Hyderabad to Markapuram = 280 Kms
Guntur to Markapuram =170 Kms
kurnool to Markapuram =162 Kms

By Train:
Markapur Road To Markapur 6km
Ongole To Markapur;94 Km
Guntur to Markapur 145 Km
Vijayawada to Markapur 176 Km
Hyderabad to Markapur 424 Km

By Air:
Airport Nearly Gannavara to Markapuram 184 Kms
Rajeev gandhi International Airport Hyderabad To Markapuram 189 Kms
Chennai International Airport Chennai To Markapuram 320 Kms

markapur temple timings, chennakesava swamy charitra in telugu, chennakesava swamy images, sri lakshmi chennakesava swamy images, markapur chennakesava swamy photos, chennakesava swamy dandakam, markapur hotels, Sri Lakshmi Chennakesava Swami Devastanam  Markapur, Sri Lakshmi Chennakesava Swamy temple history telugu.

Comments

Popular Posts